Onions: అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం
- కిలో రూ.80 వరకు పలుకుతున్న ఉల్లి ధర
- తాము చెప్పేవరకు ఉల్లి ఎగుమతులు చేయరాదన్న కేంద్రం
- తక్కువ ధరలకు తామే ఉల్లి విక్రయిస్తున్న పలు రాష్ట్రాలు
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కళ్లనీళ్లు తెప్పించేలా ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.80 వరకు పలుకుతోంది. పైగా నాణ్యత కూడా నాసిరకంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో, కేంద్రం కాస్త కటువైన నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. తాము చెప్పేవరకు ఉల్లి ఎగుమతులు నిలిపివేయాలని కేంద్రం పేర్కొంది. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.
వ్యాపారులు కావాలనే ఉల్లి నిల్వలను దాచిపెట్టి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని కేంద్రం భావిస్తోంది. ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు తామే ఉల్లిని తక్కువ ధరలకు ప్రజలకు అందిస్తున్నాయి. ఢిల్లీలో కిలో రూ.25, పంజాబ్ లో కిలో రూ.35 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కొక్కరికి 2 కిలోలు మాత్రమే అమ్ముతున్నారు.