Road Accident: కవలల బంధాన్ని విడదీసిన రోడ్డు ప్రమాదం.. సోదరుల్లో ఒకరి మృతి!
- చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద జాతీయ రహదారిపై ఘటన
- ద్విచక్ర వాహనంపై వస్తుండగా అడ్డు వచ్చిన కుక్క
- వాహనం అదుపుతప్పి పడిపోవడంతో గాయాలు
కొన్ని క్షణాల తేడాతో ఒకే రోజు పుట్టారు. ఒకేలా ఎదిగారు. చివరికి ఒకే కంపెనీలో ఉద్యోగం సాధించారు. దాదాపు 23 మూడేళ్లపాటు ఇద్దరైనా ఒక్కరిగా వ్యవహరించిన ఆ కవలల బంధంపై విధికి కన్నుకుట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఒకరిని కబళించింది. ఈ హృదయ విదారక ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని వినాయకపురం వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
పోలీసుల కథనం మేరకు...తవణంపల్లె మండలం అరగొండ పంచాయతీ ఆర్‌ఆర్‌నగర్‌కు చెందిన సురేష్‌చౌదరికి దిలీప్ కుమార్ (23), దీపక్ కుమార్ (23) ఇద్దరు కొడుకులు. ఇద్దరూ బెంగళూరులోని ఓ కంపెనీలో పని చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో శనివారం రాత్రి బెంగళూరు నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. దీపక్ వాహనం నడుపుతుండగా, దిలీప్ వెనుక కూర్చున్నాడు.
వినాయకపురం వద్దకు వచ్చేసరికి హఠాత్తుగా కుక్క అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి ఇద్దరూ పడిపోయారు. దీపక్‌కు తీవ్రగాయాలు కాగా, దిలీప్‌కు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ దీపక్ చనిపోయాడు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకుని గొల్లుమన్నారు. 23 సంవత్సరాల అన్నదమ్ముల అనుబంధాన్ని రోడ్డు ప్రమాదం విడదీసిందని కన్నీరుమున్నీరయ్యారు.