Suryapet District: హుజూర్‌నగర్‌లో నగదు, మద్యం ప్రవాహం.. భారీగా పట్టివేత
- ఉప ఎన్నికల సందర్భంగా పోలీసుల తనిఖీలు
- ఇప్పటి వరకు రూ.43 లక్షల నగదు, మద్యం పట్టివేత
- 118 నాటు తుపాకులు స్వాధీనం
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో మద్యం, నగదు ప్రవాహం మొదలయ్యింది. ఇప్పటి వరకు దాదాపు 43 లక్షల నగదు, భారీగా మద్యం, 118 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 21న ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు నగదు, మద్యం పంపిణీకి తెరతీశాయన్న విషయానికి తనిఖీల్లో దొరుకుతున్న సరుకు సాక్ష్యంగా నిలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా 54 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.