Godavari: తాము విసిరిన లంగరుకు బరువైన వస్తువు తగిలిందంటున్న ధర్మాడి సత్యం బృందం
- గోదావరిలో బోటు మునక
- పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులు
- బోటు వెలికితీత పనులు కొనసాగిస్తున్న బాలాజీ మెరైన్స్
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో కొన్నిరోజుల కిందట బోటు మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, మరికొందరి ఆచూకీ నేటికీ తెలియలేదు. ఈ నేపథ్యంలో, మునిగిపోయిన బోటును వెలికితీస్తే మరికొందరి మృతదేహాలు లభ్యమయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి.
కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థ ఈ వెలికితీత కార్యక్రమం నిర్వహిస్తోంది. బాలాజీ మెరైన్స్ అధినేత ధర్మాడి సత్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే, ధర్మాడి సత్యం బృందం విసిరిన పలు యాంకర్లలో ఓ దానికి బరువైన వస్తువు తగిలినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ లంగరుకు అనుసంధానించిన రోప్ ను పొక్లెయిన్ సాయంతో బయటికి లాగుతున్నారు. ఈ ప్రక్రియ సుదీర్ఘమైనది కావడంతో యాంకర్ కు తగిలిన వస్తువు ఏంటన్నది తెలియడానికి మరికాస్త సమయం పట్టనుంది.
ఈ వెలికితీత కార్యక్రమంలో ప్రస్తుతం రెండు పంట్లు, రెండు యాంకర్లు ఉపయోగిస్తున్నారు. ఒడ్డున కొన్ని పొక్లెయిన్లను సిద్ధంగా ఉంచారు. కాగా, బోటు వెలికితీత పనులు కొనసాగుతున్న ప్రాంతంలో ధర్మాడి బృందాన్ని తప్ప ఎవరినీ పోలీసులు అనుమతించడంలేదు.