Godavari: బోటు వెలికితీత ప్రయత్నంలో అధిక బరువు లాగలేక తెగిపోయిన రోప్!
- గోదావరిలో మొదలైన బోటు వెలికితీత పనులు
- ముమ్మరంగా శ్రమిస్తున్న ధర్మాడి సత్యం బృందం
- నదీ గర్భాన బరువైన వస్తువును లంగరుతో లాక్ చేసిన సత్యం టీమ్
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందానికి బోటు వెలికితీత పనులు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, రెండు భారీ లంగర్లతో రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం బృందం ఓ లంగరును విజయవంతంగా లక్ష్యానికి లాక్ చేయగలిగినట్టు తెలుస్తోంది. బాగా లోతున ఓ వస్తువుకు లంగరు తగలగానే దాని చుట్టూ ఐరన్ రోప్ తో లాక్ చేసిన ధర్మాడి సత్యం టీమ్ ఆపై బయటికి లాగే ప్రయత్నంలో విఫలమైంది.
అధిక బరువు కారణంగా ఐరన్ రోప్ మధ్యలోనే తెగిపోయింది. అంత లోతున బోటు కాకుండా మరే ఇతర వస్తువు ఉండే అవకాశం లేదని, అది బోటే అయ్యుంటుందని ధర్మాడి సత్యం భావిస్తున్నారు. అయితే 25 టన్నుల బరువున్న ఆ బోటు, గోదావరి వరద కారణంగా ఇసుకతో నిండిపోయి మరింత బరువెక్కి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే రోప్ తెగిపోయి ఉంటుందని, అసలు నీటి అడుగున ఓ బరువైన వస్తువు ఉన్నట్టు గుర్తించడం సగం విజయంతో సమానమని వెలికితీతలో పాల్గొంటున్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంఘటన స్థలంలో వర్షం పడుతుండడం కూడా వెలికితీత పనులకు ఆటంకం కలిగిస్తోంది.