Avanthi: మంత్రి అవంతి చిన్నా పెద్దా తేడా తెలుసుకుని మాట్లాడాలి: ద్రోణంరాజు శ్రీనివాస్ మండిపాటు
- ద్రోణంరాజుకు గ్రామ సమస్యలు తెలియవన్న అవంతి
- తాము గ్రామస్థాయి నుంచే వచ్చామన్న ద్రోణంరాజు
- మంత్రి సభామర్యాదలు పాటించాలని వ్యాఖ్యలు
విశాఖపట్నంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించిన సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. సిటీలో పెరిగిన ద్రోణంరాజుకు గ్రామాల్లోని పరిస్థితులు పెద్దగా తెలియవని అవంతి వ్యాఖ్యానించారు. దాంతో కస్సుమన్న ద్రోణంరాజు, మంత్రి అవంతి చిన్నా పెద్దా తేడా తెలుసుకుని మాట్లాడాలని అన్నారు.
తన తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ గ్రామ కరణం, సర్పంచ్ గా పనిచేశారని, ఆపై ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశారని వివరించారు. తాము వచ్చిందే గ్రామస్థాయి నుంచి అని, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం అవంతికి సరికాదని, మంత్రి సభామర్యాదలు పాటించాలని హితవు పలికారు.