imran khan: ఐరాసలో పాక్ శాశ్వత ప్రతినిధికి షాక్.. వేటేసిన ప్రధాని ఇమ్రాన్
- కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో పాక్ విఫలం
- మలీహా లోధీపై ఇమ్రాన్ అసంతృప్తి
- లోధీ స్థానంలో మునీర్ అక్రమ్ నియామకం
ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ శాశ్వత రాయబారి మలీహా లోధీకి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ షాకిచ్చారు. అమెరికా పర్యటనను ముగించుకుని ఇస్లామాబాద్ చేరుకున్న రెండు రోజులకే ఇమ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించాలని పాక్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఈ విషయంలో లోధీ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇమ్రాన్ చివరికి అతడిపై వేటేశారు. మలీహా స్థానంలో మునీర్ అక్రమ్‌ను నియమించారు.
ఐరాసలో పాక్ రాయబారిగా వెళ్లడం మునీర్‌కు ఇది రెండోసారి. 15 ఏళ్ల క్రితం ఐరాసలో పాక్ రాయబారిగా వ్యవహరించిన మునీర్ అప్పట్లో గృహ హింస కారణంగా పదవిని వదులుకున్నారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన ఇమ్రాన్ యుద్ధోన్మాదంతో ఊగిపోయారు. కశ్మీర్ విషయంలో ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో కర్ఫ్యూ ఎత్తివేసి చూడాలని భారత ప్రభుత్వానికి సవాలు విసిరారు. కాగా, కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు కూడగట్టడంలో పాక్ విఫలమైన సంగతిని ఇమ్రాన్ స్వయంగా అంగీకరించడం గమనార్హం.