bumrah: చికిత్స కోసం బుమ్రాను లండన్ పంపాలని బీసీసీఐ నిర్ణయం
- బుమ్రా వెన్ను భాగంలో చిన్న చీలిక
- వారం రోజులు ఎన్సీఏలో చికిత్స
- మెరుగైన వైద్యం కోసం లండన్ పంపాలని నిర్ణయం
గాయంతో బాధపడుతూ దక్షిణాఫ్రికాతో సిరీస్కు దూరమైన టీమిండియా నంబర్ వన్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మెరుగైన చికిత్స కోసం బ్రిటన్ వెళ్లనున్నాడు. గత నెలలో ఆటగాళ్లకు నిర్వహించిన సాధారణ రేడియాలజీ పరీక్షలో బుమ్రా వెన్ను భాగంలో చిన్న చీలిక ఉన్న విషయం బయటపడింది. దీంతో ప్రస్తుతం సఫారీలతో జరుగుతున్న సిరీస్ను నుంచి బుమ్రాకు విశ్రాంతి కల్పించిన సెలక్టర్లు అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్కు చోటిచ్చారు.
గాయం చిన్నదే అయినప్పటికీ బుమ్రా పేసర్ కావడంతో గాయం మళ్లీ తిరగబడే అవకాశం ఉండడంతో పూర్తిస్థాయిలో చికిత్స అందించాలని బీసీసీఐ నిర్ణయించింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ ఫిజియో థెరపిస్ట్ ఆశిష్ కౌశిక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక్కడ బుమ్రా వారం రోజులపాటు చికిత్స తీసుకున్నాడు. అయితే, గాయం మరీ సున్నితంగా ఉండడంతో మరింత మెరుగైన చికిత్స కోసం అతనిని లండన్ పంపడమే మేలని బీసీసీఐ నిర్ణయించింది.