Undavalli: జిన్నా తాత రాజ్ పుత్.. అబ్దుల్ భట్ బ్రాహ్మణుడు: ఉండవల్లి
- కశ్మీర్ లో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు
- పాలనలో జగన్ అప్రమత్తంగా ఉండాలి
- విద్యుత్ కోతలు ఎక్కువైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది
పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా తాత రాజ్ పుత్ వంశానికి చెందిన వారని... ముస్లిం కాన్ఫరెన్స్ అధినేత అబ్దుల్ భట్ బ్రాహ్మణుడేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వీరంతా ఇస్లాంలోకి వెళ్లారని చెప్పారు. కశ్మీర్ లో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదని... అక్కడకు ఎవరినీ వెళ్లనీయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారని... అసలు పాకిస్థాన్ కూడా మనదేనని ఉండవల్లి చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడంలో తప్పు లేదని, బీజేపీ పుట్టిందే ఈ సిద్ధాంతంమీద అని తెలిపారు. అయితే, సైన్యంతో కాకుండా, డిప్లమసీతో రద్దు చేయాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను నిర్వహించుకుంటున్న వేళ... కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ లో కర్ఫ్యూను కొనసాగిస్తోందని విమర్శించారు. ఉగ్రవాద సమస్యకు ఇప్పుడున్న పరిస్థితి పరిష్కారం కాదని చెప్పారు. పాలనలో జగన్ అప్రమత్తంగా ఉండాలని... విద్యుత్ కోతలు ఎక్కువైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సూచించారు.