Chandrababu: నీటి సంరక్షణలో కడప జిల్లా అగ్రస్థానంలో నిలవడంపై చంద్రబాబు స్పందన
- జల్ శక్తి అభియాన్ లో కడప జిల్లాకు 82.16 పాయింట్లతో అగ్రస్థానం
- గత ప్రభుత్వ కృషి ఫలితమే ఈ అవార్డులు అన్న చంద్రబాబు
- రూ.60 వేల కోట్లతో 22 ప్రాజెక్టులు పూర్తిచేశామని వెల్లడి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జల్ శక్తి అభియాన్ లో నీటి సంరక్షణలో కడప జిల్లా 82.16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దీనిపై మాజీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. నీటి సంరక్షణలో కడప జిల్లా అగ్రస్థానంలో నిలవడం సంతోషం కలిగిస్తోందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర జల్ శక్తి ప్రకటించిన 23 జాతీయ జల్ మిషన్ అవార్డుల్లో జలవనరుల ఉత్తమ నిర్వహణ విభాగంలో ఏపీకి 5 అవార్డులు దక్కాయని చంద్రబాబు వివరించారు. తమ కృషి ఫలితమే ఈ అవార్డులు అని పేర్కొన్నారు.
టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేపట్టిన నీరు-ప్రగతి, జలసంరక్షణ ఉద్యమాల సత్ఫలితాల వల్ల ఏపీకి ఈ విజయాలు దక్కాయని చంద్రబాబు ఉద్ఘాటించారు. రూ.60 వేల కోట్లతో 22 సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేశామని, 8 లక్షల పంట కుంటలు తవ్వించడంతోపాటు, 6 వేల చెక్ డ్యాములు నిర్మించి జలసంరక్షణకు పాటుపడ్డామని వివరించారు. తమ కృషి కారణంగా ఇవాళ సత్ఫలితాలు వస్తుండడం ఆనందం కలిగిస్తోందని ట్వీట్ చేశారు.