Pakistan: సరిహద్దులో విషాదం.. వరద ఉద్ధృతికి పాక్ వైపు కొట్టుకుపోయిన భారత జవాను మృతి
- గత నెల 28న పెట్రోలింగ్ నిర్వహిస్తూ కాలువలో పడి కొట్టుకుపోయిన జవాను
- మూడు రోజుల గాలింపు తర్వాత మృతదేహం లభ్యం
- అధికారిక లాంఛనాలతో భారత్కు అప్పగించనున్న పాక్ సైన్యం
భారత సరిహద్దులో విషాదం జరిగింది. పెట్రోలింగ్ నిర్వహిస్తూ మూడు రోజుల క్రితం ఓ కాలువలో పడి పాకిస్థాన్ వైపు కొట్టుకుపోయిన భారత జవాను విగతజీవిగా మారాడు. గత నెల 28న అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఐక్ నాలా ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ ఎస్ఐ పరితోశ్ మండల్ నాలా దాటుతూ వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు. ఆయన కోసం బీఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి విస్తృతంగా గాలింపు జరిపాయి. గాలింపులో భారత బృందాలకు సరిహద్దు గ్రామాల ప్రజలతోపాటు పాక్ రేంజర్లు కూడా సాయం అందించేందుకు ముందుకొచ్చారు.
చివరికి మూడు రోజుల తర్వాత నిన్న పాక్ భూభాగంలో పరితోశ్ మృతదేహాన్ని పాక్ సైన్యం గుర్తించింది. బీవోపీ ఆక్టోరాయ్ వద్ద పరితోశ్ మృతదేహాన్ని పూర్తి లాంఛనాలతో భారతదేశానికి అందజేయనున్నారు. పరితోశ్ది పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లా. తన తోటి సైనికులను కాపాడిన పరితోశ్ ప్రాణత్యాగం చేశారని, అంకితభావం కలిగిన సైనికుడిని కోల్పోవడం దురదృష్టకరమని జమ్మూ బీఎస్ఎఫ్ ఐజీ విచారం వ్యక్తం చేశారు.