Madhya Pradesh: తిండి కోసం హుండీ నుంచి బాలిక రూ.250 చోరీ.. చలించిపోయిన సీఎం

  • చోరీ నేరంపై బాలికను అరెస్ట్ చేసిన పోలీసులు
  • బెయిలు కోసం ప్రయత్నిస్తున్న కలెక్టర్
  • లక్షరూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం

ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతూ తిండిలేక అల్లాడిపోతున్న ఓ పేద కుటుంబానికి చెందిన బాలిక ఆలయ హుండీ నుంచి రూ.250 చోరీ చేసింది. అయితే, ఆ బాలికను చోరీ నేరం కింద పోలీసులు అరెస్ట్ చేయడంతో, విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై చలించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బాలిక కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.

సాగర్ జిల్లా రహాలీ గ్రామానికి చెందిన ఓ కుటుంబం కూలి పనిచేస్తూ జీవిస్తోంది. ఇటీవల ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురైంది. తినడానికి తిండి కూడా లేకపోవడంతో, గోధుమలు కొనడానికి ఆ కుటుంబానికి చెందిన 12 ఏళ్ల బాలిక టికిటోరియా ఆలయ హుండీ నుంచి రూ.250 చోరీ చేసింది. ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు బాలికను అదుపులోకి తీసుకుని  షాడోల్‌లోని కిశోర్ బాలికా సంరక్షణ గృహానికి తరలించారు. విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ ప్రీతి మైథిల్ నాయక్ ఆ చిన్నారికి బెయిల్ ఇప్పించేందుకు ముందుకొచ్చారు. బాలిక తండ్రికి రెడ్‌క్రాస్ సొసైటీ నుంచి రూ. 10 వేల ఆర్థిక సాయం ఇప్పించారు.

విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బాలిక కుటుంబానికి అండగా నిలిచారు. చిన్నారి తెలియక తప్పు చేసిందని పేర్కొన్నారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. తక్షణం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్టు పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వ పథకాలను ఆ కుటుంబానికి అందించడంతోపాటు బాలిక చదువుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News