Jagan: 2003లోనే గ్రామ సచివాలయాలను ప్రారంభించాం .. గాంధీ జయంతి రోజున కూడా మద్యం అమ్మిస్తున్నారు: చంద్రబాబు
- గ్రామ సచివాలయ వ్యవస్థను కొత్తగా తీసుకొచ్చినట్టు జగన్ మాట్లాడుతున్నారు
- 11 అవినీతి కేసులున్న వ్యక్తి నీతిమంతుడిలా చలామణి అవుతున్నారు
- పోలీసులను పెట్టి మద్యాన్ని అమ్మిస్తున్నారు
గ్రామ సచివాలయ వ్యవస్థను ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చినట్టు ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారని... 2003లోనే గ్రామ సచివాలయాలను ప్రారంభించామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 11 అవినీతి కేసులున్న వ్యక్తి నీతిమంతుడిలా చలామణి అవుతున్నారని విమర్శించారు. తానొక్కడినే నీతిమంతుడినని, ప్రజలంతా అవినీతిపరులు అన్నట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
గాంధీ జయంతి రోజున కూడా మద్యం దుకాణాలను నిర్వహించడమేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులను పెట్టి మద్యాన్ని అమ్మిస్తున్నారని... మహాత్ముడి జయంతి రోజున ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారని అడిగారు. జగన్ వ్యవహారశైలి ఎవరికీ అర్థం కావడం లేదని అన్నారు. బ్రిటీష్ వారు కూడా చట్టాన్ని అనుసరించేవారని... జగన్ మాత్రం చట్టాన్ని గౌరవించడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ జగన్ జాగీరు కాదని అన్నారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసేశారని దుయ్యబట్టారు. ఇసుక కొరతతో లక్షలాది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు.