NRSA: సైంటిస్ట్ హత్య కేసులో కొత్త కోణం.. కలకలం రేపుతున్న అనుమానాలు
- నిన్న తన ఫ్లాట్‌లోనే హత్యకు గురైన ఎన్ఆర్ఎస్ఏ శాస్త్రవేత్త
- స్కానింగ్ సెంటర్లో పనిచేసే శ్రీనివాసే హంతకుడని ప్రాథమికంగా నిర్ధారణ
- స్వలింగ సంప్కరమే అసలు కారణం అయి ఉండొచ్చని అనుమానం
హైదరాబాద్, ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగిన ఎన్ఆర్ఎస్ఏ సైంటిస్టు హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. శాస్త్రవేత్త సురేశ్ కుమార్ (56) నిన్న తన ఫ్లాట్‌లోనే హత్యకు గురయ్యారు. పోస్టుమార్టం అనంతరం సురేశ్ కుమార్ మృతదేహాన్ని బంధువులు చెన్నైకి తరలించారు. సురేశ్ కుమార్ తలపై బలమైన గాయాలు ఉన్నట్టు వైద్యుల ప్రాథమిక నివేదికను బట్టి తెలుస్తోంది. మృతదేహంపై లభించిన ఆధారాలను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఈ హత్యకు స్వలింగ సంపర్కం కారణమై ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా, సురేశ్ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు శాస్త్రవేత్తను శ్రీనివాస్ అనే వ్యక్తి హత్య చేసి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.
కేరళకు చెందిన సురేశ్ కుమార్, ఇందిర దంపతులు రెండున్నర దశాబ్దాల క్రితం హైదరాబాద్ వచ్చారు. అమీర్‌పేట, ధరమ్‌కరణ్ రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇందిర ఇండియన్ బ్యాంకు ఉద్యోగి కాగా, సురేశ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ)లో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. స్థానికంగా ఓ స్కానింగ్ సెంటర్లో పనిచేసే శ్రీనివాస్ అనే వ్యక్తి సురేశ్ ఇంటికి గత రెండు నెలలుగా వస్తున్నట్టు తెలిసింది. ఈ హత్య వెనక శ్రీనివాస్ ఉన్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.