ap and 12 other states: ఏపీకి నేడు భారీ వర్ష సూచన!
- రాయలసీమ ప్రాంతాన్ని వర్షం ముంచెత్తుతుందని హెచ్చరిక
- మరో 12 రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు
- హెచ్చరించిన ఢిల్లీలోని వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లోని రాయసీమ జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఢిల్లీలోని వాతావరణ హెచ్చరిక కేంద్రం తన తాజా బులెటెన్‌లో వెల్లడించింది. ఏపీతోపాటు మరో పన్నెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఒడిశా, జార్ఖండ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశముందని హెచ్చరించింది.
ఏపీతోపాటు దక్షిణ కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, కేరళ, బీహార్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం విశాఖ నగరం పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.
వర్షం కారణంగా నిన్న తొలిరోజు ఆటకు బ్రేక్ పడింది. ప్రస్తుతం నగరంలో వాతావరణం క్లియర్ గా ఉంది. మ్యాచ్ కొనసాగుతోంది. వాతావరణ కేంద్రం రాయలసీమకే వర్షం ఉంటుందని సూచించినందున మ్యాచ్ కి ఆటంకం లేకపోవచ్చునని అభిమానులు భావిస్తున్నారు.