Team India: వైజాగ్ టెస్ట్: తొలి ఇన్నింగ్స్ ను 502/7 వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా
- మయాంక్ డబుల్ సెంచరీ
- రోహిత్ భారీ శతకం
- పటిష్టమైన స్థితిలో టీమిండియా
వైజాగ్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను 502/7 వద్ద డిక్లేర్ చేసింది. 500 పరుగుల పైచిలుకు స్కోరు సాధించడం ద్వారా మ్యాచ్ లో సురక్షిత స్థితికి చేరింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (215), రోహిత్ శర్మ (176) పరుగుల వరద పారించడంతో రెండ్రోజుల్లోనే భారత్ భారీ స్కోరు సాధించింది. మయాంక్ డబుల్ సెంచరీ చేయడం రెండో రోజు ఆటలో హైలైట్. మయాంక్, రోహిత్ జోడీ తొలి వికెట్ కు 317 పరుగులు జోడించి పటిష్టమైన పునాది వేసినా ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ పెద్దగా రాణించలేదు.
పుజారా (6), కెప్టెన్ కోహ్లీ (20), రహానే (15), విహారి (10) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. జడేజా 30 పరుగులతో నాటౌట్ గా నిలవగా, వికెట్ కీపర్ సాహా 21 పరుగులు సాధించాడు. ఈ తరుణంలో టీ బ్రేక్ తర్వాత కాసేపటికే కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా జట్టు వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. ఓపెనర్లు డీన్ ఎల్గార్ (8), ఐడెన్ మార్ క్రమ్ (0) క్రీజులో ఉన్నారు.