Hyderabad: ఉద్యోగంలో చేరిన మూడు నెలలకే లంచం తీసుకుంటూ దొరికిన వీఆర్వో
- భూమిని మ్యుటేషన్ చేసేందుకు లక్ష డిమాండ్
- రూ.75 వేలకు ఒప్పందం
- రూ.50 వేలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన వీఆర్వో
ఉద్యోగంలో చేరి మూడు నెలలైనా గడవకుండానే ఏసీబీకి చిక్కాడో వీఆర్వో. ఓ రైతు భూమిని అతడి పేరున మ్యుటేషన్ చేయించేందుకు లంచం కోరి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. హైదరాబాద్ సమీపంలోని సరూర్‌నగర్ మండలం గుర్రంగూడకు చెందిన రైతు జక్కిడి ముత్యంరెడ్డి తుర్కయాంజల్ రెవెన్యూ పరిధిలో 1.29 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.
దీనిని తన పేరుపై మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. మార్చాల్సిన తుర్కయాంజల్ వీఆర్వో శంకర్ లక్ష రూపాయలు ఇస్తేనే మారుస్తానని తెగేసి చెప్పాడు. దీంతో అంత ఇచ్చుకోలేనని, రూ.75 వేలు మాత్రమే ఇవ్వగలనని చెప్పడంతో అంత మొత్తానికి ఒప్పందం కుదిరింది.
అనంతరం వీఆర్వో లంచం విషయాన్ని రైతు ముత్యంరెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఒప్పందం ప్రకారం గురువారం తుర్కయాంజల్ మునిసిపాలిటీ పరిధిలోని కమ్మగూడ గ్రామ రెవెన్యూ కార్యాలయంలో వీఆర్వో శంకర్‌కు రైతు ముత్యంరెడ్డి రూ.50 వేలు ఇస్తుండగా కాపుకాసిన ఏసీబీ అధికారులు వీఆర్వోను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.