cicketor sehwag: అవమానాలకు ఇమ్రాన్ సరికొత్త దారులు వెతుకుతున్నట్లుంది: పాకిస్థాన్ ప్రధానిపై సెహ్వాగ్ సెటైర్
- ట్విట్టర్ వేదికగా మాజీ క్రికెటర్‌పై వ్యంగ్యాస్త్రాలు
- ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడిన వీడియో పోస్టింగ్
- సెహ్వాగ్‌కు మద్దతుగా నిలిచిన గంగూలీ
టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్థాన్ ప్రధాని, ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్‌ఖాన్‌పై ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కశ్మీర్ అంశంపై ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రపంచం ముందు ఒంటరిగా మిగిలిన ఇమ్రాన్‌ఖాన్ తాజాగా మరిన్ని అవమానాల కోసం సరికొత్త దారులు వెతుక్కుంటున్నట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. అమెరికాకు చెందిన ఓ వార్తా చానెల్‌తో ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడిన వీడియోను కూడా ఈ సందర్భంగా పోస్టు చేశారు.
గత నెల 26న ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఇమ్రాన్ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 జీవో రద్దును ప్రస్తావించారు. భారత్ తీసుకున్న నిర్ణయం వల్ల కశ్మీర్లో హింసాత్మక సంఘటనలు పెరిగిపోయే అవకాశం ఉందన్నారు. రెండు దేశాలు అణ్వస్త్ర యుద్ధానికి దిగితే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామోఫోబియా పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత అమెరికా టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ఇమ్రాన్ ప్రసంగాన్ని ఎందుకూ కొరగాని రాద్ధాంతం అన్నట్లు మాట్లాడిన అమెరికా చానెల్ యాంకర్ వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా సెహ్వాగ్ ప్రస్తావిస్తూ ఇన్ని అవమానాలు చాలవన్నట్లు కొత్త అవమానాల కోసం ఇమ్రాన్ మార్గాన్వేషణ చేస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
సెహ్వాగ్ వ్యాఖ్యలకు మరో క్రికెటర్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. క్రికెట్ ప్రపంచానికి తెలిసిన ఇమ్రాన్ ఈయన కాదన్నారు. ఐక్యరాజ్య సమితిలో ఇమ్రాన్ ప్రసంగం పేలవంగా ఉందని, శాంతి కోరుకోవాల్సిన దేశం తీరు ఇలా ఉండకూదని వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ వ్యాఖ్యలపై మరికొందరు క్రికెటర్లు కూడా ఘాటుగానే స్పందించారు.