Budgam: మన హెలికాప్టర్ ను మన క్షిపణే బలిగొంది!... అసలు విషయాన్ని బయటపెట్టిన వాయుసేన చీఫ్
- పుల్వామా దాడులకు ప్రతీకారంగా భారత్ వైమానిక దాడులు
- బద్గాం సమీపంలో కూలిపోయిన భారత హెలికాప్టర్
- ప్రమాదవశాత్తు కూలిపోయిందని భావించిన భారత్
పుల్వామా దాడులకు ప్రతీకారంగా పీవోకేలోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ భీకర వైమానిక దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జమ్మూకశ్మీర్ లోని బద్దాం ప్రాంతంలో ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వాయుసేన సిబ్బంది, ఓ సాధారణ పౌరుడు మృతి చెందారు. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయిందని, పాక్ క్షిపణి దాడిలో కుప్పకూలిందని భిన్న వాదనలు వినిపించాయి. కానీ, ఇటీవలే కొత్తగా వాయుసేన ఎయిర్ చీఫ్ మార్షల్ గా బాధ్యతలు స్వీకరించిన ఆర్కే భదౌరియా అసలు విషయాన్ని వెల్లడించారు.
ఆ వేళ బద్గాంలో క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్నారని, అయితే ఎంఐ-17 హెలికాప్టర్ ను పాక్ కు చెందినదిగా భావించి పొరబాటున క్షిపణిని దానిపైకి సంధించారని భదౌరియా వివరించారు. ఈ దుర్ఘటనకు కారకులైన అధికారులపై న్యాయపరమైన విచారణ పూర్తిచేశామని, వారిపై కఠినచర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మున్ముందు ఇలాంటి ఘోరతప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడతామని తెలిపారు.