tsrtc: తెలంగాణలో డిపోలకే పరిమితమైన బస్సులు.. అమల్లో 144 సెక్షన్
- గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన ఆర్టీసీ సమ్మె
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
- బస్సులను అడ్డుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించిన డీజీపీ
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. గత అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలైంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో పండుగకు ఊళ్లు పయనమయ్యే వారికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న 2100 అద్దె బస్సులతోపాటు 6,900 పాఠశాలలు, కాంట్రాక్ట్ బస్సులను సిద్ధం చేసింది. అలాగే తాత్కాలిక పర్మిట్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బస్సులు నడిపేందుకు ముందుకొచ్చే వారిని కార్మిక సంఘాలు అడ్డుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా అన్ని డిపోల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తోంది. ప్రతీ డిపో వద్ద ఓ అధికారిని నియమించామని, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ మహేందర్రెడ్డి హెచ్చరించారు.