Telangana: తెలంగాణలో వీఆర్ఎస్ తీసుకున్న ఐఏఎస్ అధికారిని ఆహ్వానించి కీలక పదవినిచ్చిన జగన్!
- జూలైలో వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసిన ఆకునూరి మురళి
- గత నెల 16న ఆమోదించిన తెలంగాణ సర్కారు
- రెండు వారాల వ్యవధిలోనే ఏపీ సలహాదారుగా నియామకం
తెలంగాణలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళికి ఏపీ సర్కారు కీలక పోస్టును అప్పగించింది. పాఠశాల విద్య (మౌలిక సదుపాయాల కల్పన) సలహాదారుడిగా ఆయన్ను నియమించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు జీవో కూడా జారీ అయింది.
కాగా, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ గా మురళి పని చేస్తున్న వేళ, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఆయన్ను బదిలీ చేస్తూ, రాష్ట్ర రాజ్యాభిలేఖ (స్టేట్ ఆర్కివ్స్) సంచాలకుడిగా ప్రభుత్వం నియమించింది. ఈ పోస్టులో ఉన్న సమయంలోనే, తెలంగాణలో ఐఏఎస్ అధికారుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు చేశారు. ఆపై తన సర్వీసు మరో 10 నెలలు మిగిలివుండగానే, జూలై 27న వాలంటరీ రిటైర్ మెంట్ కు దరఖాస్తు చేసుకోగా, గత నెల 16న ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. ఆపై రెండు వారాల వ్యవధిలోనే ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మురళి నియమితులు కావడం గమనార్హం.