TSRTC: మా సంగతేంటి?... టీఎస్ ఆర్టీసీ రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికుల గోల!

  • ప్రయాణికులకు ఆర్టీసీ షాక్
  • దూరప్రాంత ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
  • గందరగోళంగా మారిన పరిస్థితి

దసరా, బతుకమ్మ పండగల కోసం స్వగ్రామాలకు వెళ్లాలని భావించిన ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇవ్వగా, ఇప్పటికే వివిధ దూరప్రాంత సర్వీసులకు రిజర్వేషన్లు చేయించుకున్న వారు తమ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. గత రాత్రి నుంచి దూరప్రాంత సర్వీసులు నిలిచిపోగా, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు చేయించుకున్న వారు గమ్యాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

వారందరి పరిస్థితి గందరగోళంగా మారగా, ప్రత్యామ్నాయ సర్వీసులను ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. టికెట్ డబ్బులను తిరిగి వెనక్కు ఇస్తారా? అనే విషయంలో స్పష్టత ఇచ్చేందుకు కూడా అధికారులు అందుబాటులో లేకపోయారు. హైదరాబాద్ లో ఎంజీబీఎస్ తో పాటు, పలు ప్రధాన నగరాల బస్టాండ్లలో ఎంక్వయిరీ కౌంటర్లు మూతపడ్డాయి.

ఇక నేటి నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు వేలాది మంది ఎన్నో రోజుల ముందుగానే టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు చేయించుకున్నారు. వారంతా తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు కట్ అవుతున్నాయని, క్యాన్సిల్ చేయకుండా ఉంటే డబ్బులు తిరిగి ఇస్తారో, ఇవ్వరోనని ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇదిలావుండగా, రిజర్వేషన్ సర్వీసులకు ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసే పరిస్థితి లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదే సమయంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్ సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 

  • Loading...

More Telugu News