TSRTC: పోలీసు భద్రత ఉన్నప్పటికీ.. టీఎస్ఆర్టీసీ బస్సు ధ్వంసం
- వికారాబాద్ డిపోకు చెందిన బస్సుపై దాడి
- దాడిలో పగిలిన బస్సు ముందు వైపు అద్దాలు
- ఆర్టీసీ ఉద్యోగులే దాడి చేసి ఉంటారని అనుమానం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ అన్ని యూనియన్లు కలసికట్టుగా సమ్మె చేస్తున్నాయి. మరోవైపు, ప్రజల సౌకర్యార్థం కొందరు ప్రైవేట్ వ్యక్తులతో కొన్ని బస్సులను నడిపే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. ఈ బస్సులను పోలీసుల బందోబస్తుతో నడుపుతోంది. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.
వికారాబాద్ డిపోకు చెందిన బస్సు పరిగి నుంచి వికారాబాద్ కు వస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు... బస్సుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో బస్సు ముందు వైపు అద్దం పగిలింది. ప్రయాణికులకు ఎలాంటి అపాయం కలగలేదు. బస్సుతో పాటు పోలీసు ఎస్కార్ట్ వాహనం ఉన్నప్పటికీ... మెరుపు వేగంతో దాడికి పాల్పడి వెళ్లిపోయారు. ఆర్టీసీ ఉద్యోగులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.