KCR: ఇప్పుడు కేసీఆర్ మసికాక తప్పదు: జీవన్ రెడ్డి
- ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే మసైపోతారు
- ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
- ఆర్టీసీ కార్మికులను కుట్రపూరితంగా సమ్మెవైపు పురికొల్పారు
ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే మసైపోతారని ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మసికాక తప్పదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేసే క్రమంలో ప్రభుత్వంలో విలీనం చేశారని... తెలంగాణ ప్రభుత్వం మాత్రం కుట్ర పూరితంగా కార్మికులను సమ్మెవైపు పురికొల్పిందని అన్నారు.
మరో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు లేకపోతే తెలంగాణ ఉద్యమం జరిగేదా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ తీరు సరికాదని అన్నారు. అవసరం ఉన్నప్పుడు ఒక విధంగా, అవసరం తీరాక మరో విధంగా మాట్లాడటం కేసీఆర్ నైజమని విమర్శించారు. కార్మికులను డిస్మిస్ చేస్తామంటే... కేసీఆర్ నే ప్రజలు డిస్మిస్ చేస్తారని చెప్పారు. గిరిజనులు, ముస్లింలను కూడా కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం నేర్పాలని అన్నారు.