Telangana: భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన టీఎస్సార్టీసీ జేఏసీ
- రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్ల మద్దతు కోరతాం
- రేపు లేఖలు అందజేస్తాం
- రేపు ట్రేడ్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశం
టీఎస్సార్టీసీ కార్మికులు సమ్మె విరమించకపోతే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తామన్న ప్రభుత్వ హెచ్చరికను కార్మికులు బేఖాతరు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను టీఎస్సార్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈ సందర్భంగా జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, వచ్చే రెండు రోజులకు తమ కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించారు.
రేపు అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి సంఘాల మద్దతు కోరుతూ లేఖలు ఇస్తామని చెప్పారు. రేపు ఉదయం 11 గంటలకు ట్రేడ్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, సాయంత్రం 5 గంటలకు అన్ని డిపోల దగ్గర కార్మికుల కుటుంబ సభ్యులు బతుకమ్మ ఆడతారని, ఎల్లుండి ఉదయం 8 గంటలకు గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పిస్తామని, అనంతరం, ఇందిరాపార్క్ వద్ద నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు.
ప్రయాణికులకు అసౌకర్యం కల్పించడం జేఏసీ ఉద్దేశం కాదని, సెప్టెంబర్ లోనే సమ్మె నోటీస్ ఇచ్చామని గుర్తుచేశారు. దసరా పండగ వచ్చే వరకు ప్రభుత్వం తమతో చర్చలు జరపకపోగా, యూనియన్లపై నిందలు వేస్తోందని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకూ తమ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విధులకు హాజరుకాని కార్మికులను తొలగించాలంటే, మొట్టమొదట తనను ఉద్యోగం నుంచి తొలగించాలని అన్నారు. ప్రతిరోజు శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తామని చెప్పారు.