Thailand: నిందితులను నిర్దోషులుగా ప్రకటించి.. తనను తాను కాల్చుకున్న న్యాయమూర్తి
- థాయ్‌లాండ్‌లోని యాలా న్యాయస్థానంలో ఘటన
- నిందితులు తప్పు చేయలేదని తాను చెప్పలేనన్న జడ్జి
- థాయ్‌లాండ్ కోర్టులు సంపన్నుల కోసమేనని ఆరోపణ
ఓ హత్యకేసులో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన న్యాయమూర్తి ఆ వెంటనే తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. థాయ్‌లాండ్‌లోని యాలా న్యాయస్థానంలో జరిగిందీ ఘటన. ఓ హత్యకేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి కనకోర్న్ పియన్‌చన ఈ ఘటనకు పాల్పడ్డారు. నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. నిందితులు తప్పు చేయలేదని తాను చెప్పలేనని అన్నారు. న్యాయప్రక్రియ ఎప్పుడూ పారదర్శకంగా, విశ్వసనీయంగా ఉండాలని అన్నారు. తప్పు చేయని వారిని శిక్షించడమంటే వారిని బలిపశువులను చేయడమే అవుతుందన్నారు.
థాయ్‌లాండ్ కోర్టులు సంపన్నుల కోసమే పనిచేస్తాయన్న అభిప్రాయం ఉందన్న న్యాయమూర్తి.. నిందితులు నిజంగా నేరానికి పాల్పడ్డారా? లేదా? అన్నది నిర్ధారించుకోకుండా శిక్షించవద్దని చెబుతూ తుపాకితో చాతీలో కాల్చుకున్నారు. దీంతో కిక్కిరిసిన కోర్టు హాలులో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రక్తమోడుతున్న న్యాయమూర్తిని ఆసుపత్రికి తరలించారు. కనకోర్న్‌కు ప్రాణాపాయం తప్పినట్టు వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.