TSRTC: కదిలే బస్సుల ముందు బతుకమ్మ... తొక్కించుకుని వెళ్లాలంటూ ఆర్టీసీ కార్మికుల నిరసనలు!
- నేడు ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన
- ఏపీ బస్సులను శివార్లలోనే అడ్డుకున్న ఐకాస
- హైదరాబాద్ నగరంలోకి 7 సీటర్ ఆటోలు
తెలంగాణలో నిన్న మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. ఈ ఉదయం ఒక్క బస్సు కూడా బయటకు రాకపోగా, ప్రైవేటు, తాత్కాలిక, ఒప్పంద ఉద్యోగులను సైతం డిపోల్లోకి రానిచ్చేది లేదంటూ కార్మికులు నిరసనలు తెలియజేస్తున్నారు. డిపోల ముందు బతుకమ్మలను పేర్చి దమ్ముంటే వాటిని తొక్కించుకుని వెళ్లాలంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని చాలా డిపోల నుంచి ఈ ఉదయం ఇంకా బస్సులు బయటకు రాలేదు. ఆర్టీసీ యూనియన్లు వ్యూహాత్మకంగా ఆలోచించే నేడు సద్దుల బతుకమ్మ పండుగ కావడంతో, బతుకమ్మలను తెచ్చి, డిపోల నుంచి బయటకు రావాలని చూసే బస్సులను అడ్డుకుంటున్నారని తెలుస్తోంది.
ఇక ఈ ఉదయం సమ్మె ఉద్ధృతం కాగా, కనీసం నిన్న నడిచినన్ని బస్సులు కూడా నేడు నడిచే పరిస్థితి కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న కొన్ని స్పెషల్ బస్సులను పంపగా, వాటిని శివార్లలోనే అడ్డుకున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, అటు నుంచి అటే వాటిని వెనక్కు పంపేశారు. కొన్ని బస్సులు వచ్చినప్పటికీ, అవి ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ఏ మాత్రమూ సరిపోవడం లేదు.
హైదరాబాద్ నగరంలో అటూ ఇటూ తిరగడానికి మెట్రో సర్వీసులు, 7 సీటర్ ఆటోలు, క్యాబ్ లు అందుబాటులో ఉండగా, అవి మరో మూడు, నాలుగు రోజుల వరకే వేగంగా ప్రయాణికుల అవసరాలు తీరుస్తాయి. దసరా సెలవులు మంగళవారంతో ముగిస్తే, ఆపై వెంటనే రద్దీ పెరుగుతుంది. ఈలోగా ఆర్టీసీ సమ్మె పరిష్కారం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ పరిష్కారం కాకుంటే, ప్రత్యామ్నాయ మార్గాలన్నీ అన్వేషిస్తామని అధికారులు అంటున్నారు.