Vizag: రెండో పెళ్లి కోసం... వాటర్ ట్యాంక్ పైకెక్కి యువతి బెదరింపులు!
- విశాఖ జిల్లా దేవరాపల్లిలో ఘటన
- వితంతువుతో వివాహితుడి సంబంధం
- కౌన్సెలింగ్ ఇచ్చి పంపించిన పోలీసులు
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని మోసం చేసిన యువకుడు, ఇప్పుడు అన్యాయం చేస్తున్నాడంటూ, ఓ వితంతు యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం విశాఖ జిల్లా దేవరాపల్లిలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, అనంతగిరి మండలం జీనబాడు గ్రామానికి చెందిన గిరిజన యువతికి నాలుగేళ్ల క్రితం వివాహం కాగా, భర్త చనిపోయాడు. ఆపై తనకు దగ్గరి బంధువైన శిరగం మౌళితో ఆమె వివాహేతర బంధం కొనసాగిస్తోంది.
మౌళికి అప్పటికే భార్య, ఇద్దరు పిల్లలున్నా, ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని అతనిపై ఒత్తిడి తెస్తోంది. పెదకోట పంచాయతీలో వీఆర్ఏగా పని చేస్తున్న మౌళి, రెండో పెళ్లి చేసుకోవడానికి వెనుకంజ వేస్తుండటంతో, ఇటీవల ఆమె రైవాడ జలాశయం గేట్లపై నుంచి దూకేందుకు ప్రయత్నించి విఫలమైంది.
ఆ సమయంలో పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఇక శనివారం మధ్యాహ్నం, దేవరాపల్లి పంచాయితీ కార్యాలయం పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కిన ఆమె, మౌళి పెళ్లి చేసుకుంటానని మాటిస్తే తప్ప కిందకు దిగబోనని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఆపై మౌళిని పోలీసులు పిలిపించగా, పెళ్లికి అంగీకరించాడు. దీంతో ఆమె కిందకు దిగిరాగా, మరోసారి కౌన్సెలింగ్ ఇచ్చి, తల్లిదండ్రులకు అప్పగించారు.