Lalitha Jewellers: యువ నటిని వెంటేసుకుని శ్రీలంక పారిపోయిన లలితా జ్యూయలర్స్ దొంగ!
- ప్రధాన నిందితుడు మురుగన్
- రూ. 10 కోట్ల బంగారంతో లంకకు పరారీ
- కొలంబోకు ప్రత్యేక పోలీసు బృందాలు
కేరళలోని తిరుచ్చిలో జరిగిన లలితా జ్యువెలరీ చోరీ కేసులో ప్రధాన నిందితుడు రూ. 10 కోట్ల విలువైన నగలతో పాటు, ఓ తమిళ యువ నటిని వెంటేసుకుని శ్రీలంకకు పారిపోయినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 2వ తేదీన దొంగతనం జరుగగా, రూ. 13 కోట్ల విలువైన ఆభరణాలు చోరీకి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే మణికంఠన్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి, 4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితునిగా భావిస్తున్న తిరువారూరుకు చెందిన మురుగన్ మాత్రం ఇంకా దొరకలేదు. అతను హెచ్ఐవీతో బాధపడుతున్న రోగని కూడా పోలీసులు గుర్తించారు. ఇక ఇతని వలలో సదరు హీరోయిన్ ఎలా పడిందన్న విషయం మాత్రం తెలియడం లేదు.
కాగా, కోటీశ్వరుడైన మురుగన్ కు చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో విలువైన ఆస్తులున్నాయని గుర్తించారు. గతంలో మురుగన్ కొన్ని సినిమాలను కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. మురుగన్ ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను శ్రీలంక పంపుతున్నామని, అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చామని తమిళనాడు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.