India: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న అశ్విన్... సౌతాఫ్రికా స్కోరు 71/8
- 66వ టెస్టులోనే 350 వికెట్లు
- మురళీధరన్ సరసన అశ్విన్
- మరో రెండు వికెట్లు తీస్తే ఇండియాదే విజయం
విశాఖపట్నంలో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు పరాజయం ముగింట నిలుచుంది. డ్రింక్స్ బ్రేక్ సమయానికి 52/4 వికెట్ల వద్ద ఉన్న జట్టు స్కోరు, మరో 18 పరుగులు జోడించేసరికి మొత్తం 8 వికెట్లు కోల్పోయింది. 70 పరుగుల స్కోరు వద్ద ఆ జట్టులోని అలెన్ మర్క్ రామ్, వెమాన్ ఫిలాండర్, కేశవ్ మహరాజ్ అవుట్ అయ్యారు. అంతకుముందు 60 పరుగుల స్కోరు వద్ద డి కాక్ పెవీలియన్ కు చేరాడు. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే మరో రెండు వికెట్లు తీయాలి. ప్రస్తుతం క్రీజులో ముత్తుస్వామి (9), పెడిట్ (1) ఉన్నారు.
ఈ క్రమంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ టెస్ట్ మ్యాచ్ లలో 350 వికెట్లను తీసిన బౌలర్ గా ముత్తయ్య మురళీధరన్ సరసన నిలిచాడు. వీరిద్దరూ ఈ ఫీట్ ను తామాడిన 66వ మ్యాచ్ లో సాధించడం గమనార్హం. భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన 350వ వికెట్ ను 77వ టెస్టులో, హర్భజన్ సింగ్ 83వ టెస్టులో సాధించారు. నేడు బ్రియాన్ వికెట్ ను తీయడం ద్వారా అశ్విన్ ఈ రికార్డును సాధించాడు.