Guntur District: పూజల పేరుతో అమాయకులను నిలువునా ముంచుతున్న ముఠా గుట్టు రట్టు

  • అయ్యప్ప మాల ధరించి మోసం
  • ఓ మహిళ నుంచి రూ.18 వేల నగదు, బంగారు నగలతో పరార్
  • పట్టుకుని పోలీసులకు అప్పగించిన గ్రామస్థులు 

కీడు పేరుతో అమాయకులను భయపెట్టి ఆపై పూజల పేరుతో వారిని నిలువునా ముంచుతున్న ముఠాకు పోలీసులు అరదండాలు వేసి కటకటాల వెనక్కి పంపారు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఎర్రబాలెం గ్రామానికి చెందిన వారా సాంబయ్య, వారా బాజి, బూతుల సాంబయ్యలు అయ్యప్పమాల ధరించారు. గత మూడు రోజులుగా వీరులపాడు మండలంలో తిరుగుతున్న వీరు.. తమకు తారసపడిన ఆయా వ్యక్తులను బెదిరిస్తూ, మీ కుటుంబ సభ్యులు త్వరలో అనారోగ్యం బారినపడతారని, కీడు జరుగుతుందని చెప్పారు. కీడు పోవాలంటే పూజలు చేయాలని చెప్పి వేల రూపాయలు కాజేయడం మొదలెట్టారు.

గూడెంమాధవరం గ్రామంలో నిన్న పర్యటించిన ఈ ముఠా గద్దె రేణుక ఇంటికి వెళ్లింది. ఆమె పెద్ద కుమార్తె మరో రెండు వారాల్లో అనారోగ్యం బారిన పడుతుందని చెప్పి వారిని భయభ్రాంతులకు గురిచేసింది. బయటపడేందుకు పూజలు చేయాలని నమ్మించి రూ. 18 వేల నగదు, బంగారు నగలతో ఉడాయించింది. విషయం తెలిసిన రేణుక భర్త నరసింహారావు వారిని పట్టుకునేందుకు బయలుదేరాడు. ఎట్టకేలకు మునగపాడు వద్ద చిక్కారు.

 తమను పట్టుకునేందుకు వస్తున్నారన్న విషయాన్ని గ్రహించిన ముఠా.. రేణుక నుంచి తీసుకున్న సొమ్మును రోడ్డుపై విసిరేసి, బైక్‌లు వదిలి పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే, గ్రామస్థులు చాకచక్యంగా వ్యవహరించడంతో పట్టుబడ్డారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. ప్రజలను మోసం చేసేందుకే తాము అయ్యప్ప మాల ధరించినట్టు విచారణలో ముఠా సభ్యులు అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News