Kanna: వినూత్న నిరసన... జోలె పట్టుకుని గుంటూరు రోడ్లపై కన్నా భిక్షాటన!
- ఇసుక విధానంపై బీజేపీ నిరసన
- జగన్ విధానాలతో రోడ్లపై పడ్డ కార్మికులు
- నెలకు రూ. 10 వేలు నష్టపరిహారం ఇవ్వాలి
- ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆరోపిస్తూ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వినూత్న నిరసనకు దిగారు. ఈ ఉదయం గుంటూరు రహదారులపై ఆయన జోలెపట్టి, భిక్షాటన చేశారు. ఇసుక విధానాన్ని నిరసిస్తూ, బీజేపీ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం జరుగగా, స్థానిక పట్నం బజారులో కన్నా పాల్గొన్నారు.
భవన కార్మికులను ఆదుకునేందుకు తోచినంత సాయం చేయాలని తనకు కనిపించిన వారిని అడుగుతూ ఆయన ముందుకు సాగారు. జగన్ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తెచ్చినా, ఎక్కడా, ఇసుక అందుబాటులో లేదని ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వేలాది నిర్మాణాలు ఆగిపోయి, కార్మికులకు పని లేకుండా పోయిందని, ఇందుకు జగన్ విధానాలే కారణమని విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లయిందని ఆయన అన్నారు. ఉపాధిని కోల్పోయిన కార్మికులకు నెలకు రూ. 10 వేలను నష్ట పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.