KCR: 2003లో తమిళనాడులో 1.70 లక్షల మందిని తీసేసిన జయలలిత... నేడు కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా చర్చ!
- అప్పట్లో తమిళనాడులో సమ్మెకు దిగిన ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది
- కఠిన నిర్ణయాన్ని తీసుకున్న జయలలిత
- టీఎస్ లో సమ్మెకు దిగిన ఆర్టీసీ ఉద్యోగులపై కేసీఆర్ కఠిన వైఖరి
అది 2003. తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు దిగగా, వారిపై కఠిన వైఖరిని అవలంబిస్తూ, మొత్తం 1.70 లక్షల మందిని తొలగించాలని జయలలిత నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే ఆర్డినెన్స్ కూడా జారీ అయింది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇక, తాజాగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగగా, వారెవరినీ తిరిగి విధుల్లోకి తీసుకునేది లేదని కేసీఆర్ స్వయంగా ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది. వాస్తవానికి టీఎస్ ఆర్టీసీలో 49,860 మంది ఉద్యోగులు ఉండగా, వారిలో 1,200 మంది వరకూ మాత్రమే విధుల్లో ఉన్నట్టు వెల్లడించిన కేసీఆర్, సమ్మెలో ఉన్న వారిని తిరిగి రానివ్వబోమని స్పష్టం చేశారు. దీని ద్వారా మిగిలిన సుమారు 48,660 మందిని తొలగించినట్టేనని కేసీఆర్ చెప్పకనే చెప్పినట్టు అయింది. ఇక అదే జరిగితే సంచలనమేనని నిపుణులు అంటున్నారు.