India: భారత్ చేతికి స్విస్ నల్ల కుబేరుల ఖాతాల వివరాలు!
- నల్లధనంపై మోదీ సర్కారు పోరు
- తొలి జాబితా అందించిన స్విస్ ప్రభుత్వం
- వచ్చే ఏడాది మరో జాబితా
భద్రతకు, గోప్యతకు మారుపేరుగా నిలిచే స్విస్ బ్యాంకుల్లో భారతీయులు డబ్బు, బంగారం దాచుకోవడం ఈనాటిది కాదు. అయితే, స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముకు సరైన లెక్కలు చూపకపోతే అది నల్లధనం కిందే లెక్క! ఇలాంటి ఖాతాలు లెక్కకు మిక్కిలి ఉన్నట్టు గత ప్రభుత్వాలు ఎప్పుడో గుర్తించినా, ఆ నల్లధనాన్ని స్వదేశానికి చేర్చే ప్రక్రియ మోదీ హయాంలో ఊపందుకుంది.
తాజాగా, స్విస్ బ్యాంకుల్లో తమ సంపదను దాచుకున్న భారతీయుల వివరాలను స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ టీఏ) కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ప్రస్తుతం భారత్ కు అందినది మొదటి జాబితాగా భావిస్తున్నారు. ఈ జాబితాలో అనేకమంది వ్యాపారవేత్తలు, ఎన్నారైలు ఉన్నట్టు గుర్తించారు. 2018లో అనేకమంది తమ ఖాతాలు మూసివేసినట్టు తాజా జాబితా ద్వారా వెల్లడైంది. ప్రస్తుతానికి తొలి జాబితా అందించామని, వచ్చే ఏడాది మరికొందరి పేర్లతో తదుపరి జాబితా అందజేస్తామని ఓ అధికారి తెలిపారు.