Jooli: మరింత షాక్... రెండో భర్త మొదటి భార్యనూ, బిడ్డను కూడా చంపేసిన జాలీ!
- ఆస్తి కోసం 14 ఏళ్లలో 6 హత్యలు
- పోలీసుల విచారణలో మరిన్ని హత్యలు వెలుగులోకి
- 11 మంది పోలీసులనూ ప్రశ్నిస్తున్న అధికారులు
కేరళలో తీవ్ర కలకలం రేపిన ఆరు హత్యల కేసును మరింత లోతుగా విచారిస్తున్న పోలీసులు దిగ్భ్రాంతి కలిగించే మరిన్ని విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఆస్తి కోసం 14 సంవత్సరాల వ్యవధిలో ఆరు హత్యలకు పాల్పడిన జాలీ మరిన్ని హత్యలకు పాల్పడిందని క్రైమ్ బ్రాంచ్ పోలీసు ఉన్నతాధికారులు తేల్చారు.
జాలీ రెండో భర్త షాజును కూడా అరెస్ట్ చేసి విచారించిన తరువాత, వీరిద్దరూ కలిసి షాజు తొలి భార్యను, వారి కుమార్తెను కూడా చంపేశారని తేలింది. తన భార్య సిలీ, కుమార్తె ఆల్ఫైన్ హత్య వెనుక జాలీ ఉందని, తాను కూడా సహకరించానని షాజూ అంగీకరించినట్టు అధికారులు వెల్లడించారు. జాలీ అరెస్ట్ అయిన తరువాత పాత సాక్ష్యాలను దొరక్కుండా చేసేందుకు ప్రయత్నించానని అంగీకరించాడు. ఇంట్లోని వస్తువులను, కంప్యూటర్ ను మరో ప్రాంతానికి తరలించానని చెప్పగా, ఈ మొత్తం కేసుతో షాజుకు కూడా సంబంధం ఉందన్న నిర్ధారణకు వచ్చిన పోలీసులు, వీరు మరిన్ని హత్యలకు పాల్పడి వుండవచ్చని అంటున్నారు.
2016లో జాలీతో ఆర్థిక సంబంధాలు కలిగివున్న కోజికోడ్ కాంగ్రెస్ నేత రామకృష్ణన్ గుండెపోటుతో మరణించాడు. ఈ కేసును ఇప్పుడు పోలీసులు తిరగదోడుతున్నారు. జాలీతో నిత్యమూ 11 మంది వరకూ పోలీసులు టచ్ లో ఉండేవారని తేలడంతో, వారందరినీ ప్రశ్నిస్తున్నారు.