Kurnool District: బన్ని ఉత్సవానికి సర్వమూ సిద్ధం... రక్తం చిందకుండా చూసేందుకు పోలీసుల ప్రయత్నం!
- దేవరగట్టులో కర్రల సమరం
- హింస వద్దని పోలీసుల అవగాహనా కార్యక్రమాలు
- ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటు
దసరా రోజున కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే బన్ని ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 11 గ్రామాల ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి, ఆలూరు సమీపంలోని మాల మల్లేశ్వరుల విగ్రహాల కోసం రక్తం కారేలా కర్రలతో కొట్టుకుంటారన్న సంగతి తెలిసిందే. బన్ని ఉత్సవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా జనం హాజరవుతారు. ఈ ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడాలని, రక్తం కారకుండా ఉత్సవాలు జరపాలని పోలీసులు ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా, ప్రజలు మాత్రం తమ సంప్రదాయంలో భాగమైన కర్రల సమరాన్ని మాత్రం వదలడం లేదు.
ఇక ప్రతి యేటా మాదిరిగానే ఈ సంవత్సరమూ కర్రల సమరానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా భారీ స్థాయిలో ఇప్పటికే దేవరగట్టు చేరుకున్నారు. విగ్రహాల ఊరేగింపు జరిగే వీధుల్లో సీసీ కెమెరాలను అమర్చారు. ఇనుప చువ్వలు గుచ్చే కర్రలను వాడవద్దని గత 10 రోజులుగా గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఇనుప చువ్వలు వాడినట్టు తెలిస్తే, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. బన్ని ఉత్సవం కోసం సిద్ధం చేసిన కర్రలను అధికారులు పరిశీలించారు. ఇక ఉత్సవంలో గాయపడిన వారికి వెంటనే చికిత్సను అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను, అంబులెన్స్ లను సిద్ధం చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రశాంతంగా బన్ని ఉత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.