USA: టర్కీకి మద్దతిస్తూ.. సిరియా నుంచి వెనక్కి మళ్లిన అమెరికా బలగాలు!
- సరిహద్దుల వెంబడి అమెరికా సైన్యం
- ఉగ్రవాదులపై దాడులకు టర్కీ సైన్యం సన్నద్ధం
- ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన
సిరియా, టర్కీ సరిహద్దు రేఖ వెంబడి మోహరించిన సైన్యాన్ని అమెరికా వెనక్కు తీసుకుంది. ఉత్తర సిరియాలోని రాస్ అల్–అయిన్, తాల్ అబ్యాద్, కొబానె వంటి కీలక ప్రాంతాల నుంచి జవాన్లను, ప్రత్యేక బలగాలను అమెరికా ఉపసంహరించుకుందని సిరియన్ మానవ హక్కుల సంఘం తెలియజేసింది. ఉత్తర సిరియాలో మకాం వేసి, సాధారణ జన జీవనానికి ఇబ్బందులు సృష్టిస్తున్న కుర్దు ఉగ్రవాదులపై దాడులకు టర్కీ సైన్యం సన్నాహకాలు చేస్తున్న నేపథ్యంలో, అమెరికా సైన్యం వెనక్కి మళ్లినట్లు సమాచారం.
ఉగ్రవాదులపై సైనిక అపరేషన్ చేపట్టాలన్న టర్కీ అధ్యక్షుడి నిర్ణయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే మద్దతు పలికారు. ఉగ్రవాదులను టర్కీ దీటుగా ఎదుర్కొనేందుకు తమవంతు సహకారాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. టర్కీ దీర్ఘకాలిక ప్రణాళికకు అమెరికా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన వెలువరించింది. అయితే, టర్కీ జరిపే సైనిక దాడుల్లో అమెరికా సైన్యం మాత్రం పాల్గొనబోదని స్పష్టం చేసింది.