Imran khan: పాక్ ప్రభుత్వ వ్యవహారాల్లో ఆర్మీ జోక్యం.. ఇమ్రాన్ కంటే ముందే చైనాలో అడుగుపెట్టిన ఆర్మీ చీఫ్
- పాక్‌లో ఇటీవల వ్యాపారవేత్తలతో బజ్వా సమావేశం
- ఇమ్రాన్‌తో కలిసి చైనా అధ్యక్షుడితో సమావేశంలో పాల్గొనే అవకాశం
- ఇటీవలే మూడేళ్లు పెరిగిన పదవీ కాలం
పాక్ వ్యవహారాల్లో ఆర్మీ జోక్యం పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనం. చైనాలో ఇమ్రాన్ పర్యటన మొదలవడానికి ముందే ఆ దేశ ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వా చైనాలో అడుగుపెట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇమ్రాన్ మంగళవారం చైనాలో అడుగుపెట్టగా, ఖమర్ ఒక రోజు ముందే చైనా చేరుకున్నారు. పాక్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరుతూ ఖమర్ బజ్వా ఇటీవల పాక్‌లో వ్యాపారవేత్తలతో సమావేశమై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఇమ్రాన్ కంటే ముందే చైనాలో పర్యటిస్తున్నారు.
కాగా, చైనాలో పర్యటిస్తున్న ఇమ్రాన్.. వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. అదే సమయంలో కశ్మీర్ విషయంలో మద్దతు కోరుతూ బజ్వా చైనా మిలటరీ అధికారులతో సమావేశమయ్యారు. ఇమ్రాన్‌తోపాటు బజ్వాకు కూడా చైనా సమాన ప్రాధాన్యం ఇస్తుండడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి చైనా పర్యటకు వెళ్లే అధికారుల జాబితాలో బజ్వా పేరు లేదు. అయితే, చివరి నిమిషంలో చేర్చారు. దీనికి చైనా కూడా ఓకే చెప్పింది.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఇమ్రాన్ భేటీ కానుండగా, బజ్వా కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. చైనాను మెప్పించడంలో ఇమ్రాన్ విఫలమవుతుండడంతోనే ఇప్పుడు బజ్వా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. కాగా, బజ్వా పదవీ కాలాన్ని ఇమ్రాన్ ఇటీవలే మరో మూడేళ్లు పొడిగించారు.