Salman Khurshid: రాహుల్ గాంధీపై సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు!
- రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి
- యూపీలో ఏకంగా రాహులే ఓడిపోయారు
- సమస్యలకు ఎదురు నిలవడం లేదని వ్యాఖ్య
రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో పాటు, తమ అధీనంలో ఉన్న ఒక్కో రాష్ట్రాన్నీ కోల్పోతున్న కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఏకంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. రాహుల్ అన్ని విషయాల్లోనూ ఎదురు నిలవకుండా దూరంగా వెళ్లిపోతున్నారని, తమకు అదే పెద్ద సమస్య అని అన్నారు.
ఇక ఈ నెలలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాహుల్ వైఖరితో పార్టీలో ఓ రకమైన శూన్యం ఏర్పడిందని, దాన్ని భర్తీ చేసేందుకు సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నా, కుదరడం లేదని అన్నారు. యూపీలోని 80 సీట్లలో కేవలం ఒకే ఒక్క సీటును కాంగ్రెస్ గెలుచుకోవడం, స్వయంగా రాహుల్ గాంధీ ఓడిపోవడం క్లిష్ట పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయని సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.