Asaduddin Owaisi: ప్రత్యేక హిందూ దేశం ఎందుకు?: మోహన్ భగవత్ పై ఒవైసీ ఫైర్
- హిందూ దేశం అనే భావన మెజారిటీ వాదం నుంచి పుట్టుకొచ్చింది
- ఇది హిందూయేతరులను లొంగదీసుకోవడమే
- మైనారిటీలు భారతీయులే అయినప్పటికీ.. వారికి ఎలాంటి హక్కులు లేవు
ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ పై ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. భారతదేశం హిందూ దేశం అనే భావనకు మైనారిటీలు వ్యతిరేకం కాదంటూ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఒవైసీ తప్పుబట్టారు. భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశంలో మైనారిటీలకు ఎలాంటి హక్కులు లేకుండా, దేశంలో నివసిస్తున్న పౌరులుగా మాత్రమే చూసే విధంగా ఉన్నాయని అన్నారు. వారి ఆలోచనా విధానం కూడా అదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూ దేశం అనే భావన హిందూ మెజారిటీ వాదం నుంచి పుట్టుకొచ్చిందని ఒవైసీ ట్వీట్ చేశారు. ఇది హిందూయేతరులను లొంగదీసుకోవడమే అవుతుందని అన్నారు. మైనారిటీలు భారతీయులే అయినప్పటికీ... వారికి ఎలాంటి హక్కులూ లేవని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం మనమంతా భారతీయులే అయినప్పుడు ప్రత్యేక హిందూ దేశం ఎందుకని ప్రశ్నించారు. అభద్రతాపరమైన భావన నుంచి ఊహాజనిత ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు.