Telangana: మరి, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తారా?: జస్టిస్ చంద్రకుమార్
- ఆర్టీసీ నష్టాల్లో ఉందని ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు?
- ప్రభుత్వం కూడా అప్పుల్లో ఉంటే అదే పని చేస్తారా?
- ఆ రోజున ఏం మాట్లాడారు? ఇప్పుడేం మాట్లాడుతున్నారు?
టీఎస్సార్టీసీ నష్టాల్లో ఉంది కనుక ప్రైవేట్ పరం చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, మరి, ప్రభుత్వం కూడా అప్పుల్లో ఉంటే దాన్ని కూడా ప్రైవేటీకరిస్తారా అని జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. యూనియన్లు అవసరం లేదనడం చాలా దుర్మార్గం అని, ఎన్నికల సమయంలో, సకలజనుల సమ్మె అప్పుడు ఆర్టీసీ కార్మికుల గురించి కేసీఆర్ ఏం మాట్లాడారో ఓసారి గుర్తుకుతెచ్చుకోవాలని సూచించారు.
ఆర్టీసీ కార్మికుల కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని, వారి జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సమానం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఆరోజున మాట్లాడిన మాటేంటి? ఈరోజున మాట్లాడుతున్న మాటేంటి? అని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నడపడం చేతకాకపోతే, దాన్ని పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బిజినెస్ వ్యక్తులే నడుపుతారనుకుంటే రామేశ్వరరావుకో, కృష్ణారెడ్డికో ఈ ప్రభుత్వాన్ని అప్పగించాలని కేసీఆర్ పై సెటైర్ వేశారు.