Telangana: తెలంగాణలో లిక్కర్ షాపులకు తెగ డిమాండ్!
- కొత్త మద్యం పాలసీని ప్రకటించిన ప్రభుత్వం
- తొలి రోజున 233 దరఖాస్తులు
- ప్రక్రియను సమీక్షించిన శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్రంలో నూతన లిక్కర్ విధానాన్ని ప్రకటించిన తరువాత, షాపుల కోసం నోటిఫికేషన్ విడుదల కాగా, తొలిరోజునే అమిత స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2 లక్షల వెనక్కు తిరిగి ఇవ్వబడని డిపాజిట్ తో దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించగా, తొలి రోజున 233 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల దాఖలుకు సమయం ఉన్నప్పటికీ, దసరానాడు టెండర్ వేయాలన్న ఉద్దేశంతో ఉన్న ఎంతో మంది తమ టెండర్లను సమర్పించారు.
తొలి రోజు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా పరిశీలించారు. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ కు వచ్చిన ఆయన, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రిటైల్ వైన్ షాప్ ల దరఖాస్తులను స్వీకరిస్తున్న ఏర్పాట్లపై ఆయన చర్చలు జరిపారు. మొత్తం 33 జిల్లాల్లో 34 దరఖాస్తు స్వీకరణ ఏర్పాట్లు చేశామని, మొత్తం విధానాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.