Kanti Velugu: మరో నవరత్న హామీ అమలు... ఏపీలో కంటివెలుగు షెడ్యూల్ ఇది!
- ఎన్నికలకు ముందు కంటివెలుగు హామీ
- నేడు అనంతపురంలో ప్రారంభించనున్న జగన్
- ఆరు దశల్లో హామీ అమలుకు నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల్లో కీలకమైన కంటివెలుగు నేడు ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని నేడు అనంతపురం జిల్లాలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. నగరంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగే ఓ కార్యక్రమంలో పథకాన్ని లాంచ్ చేయనున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఆరు విడతలుగా నిర్వహించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. తొలి దశలో రాష్ట్రంలోని 62 వేల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కంటివెలుగులో భాగంగా పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం నిపుణులైన కంటి డాక్టర్లను, సిబ్బందిని ఇప్పటికే నియమించారు. 16వ తేదీ వరకూ తొలి దశ సాగనుంది. ఇందులో 70 లక్షల మందికి పైగా చిన్నారులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు.
నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకూ రెండో దశ కంటివెలుగు సాగుతుంది. రెండో దశలో స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీలతో పాటు క్యాటరాక్ట్ ఆపరేషన్లు అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1 నుంచి మిగతా దశల కంటి పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి నుంచి కమ్యూనిటీ బేస్ ఆధారంగా పరీక్షలు జరుపుతామని అధికారులు ఇప్పటికే వెల్లడించారు.