Kerala: పెరుగుతున్న జాలీ హత్యల జాబితా.. మరో ముగ్గురిని చంపించిందని తాజా ఆరోపణ
- జాలీ భర్త రాయ్‌థామస్ బంధువు ఎల్సమ్మ వెల్లడి
- తన కొడుకుతోపాటు మరికొందరిని చంపించిందని ఆరోపణ
- విచారణ జరుపుతామన్న ఎస్పీ
కేరళలోని కోజీకోడ్‌లో వరుస హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలు జాలీ చేతిలో మరింతమంది చనిపోయినట్లు బయటపడుతోంది. ఆమె చంపింది, చంపించింది ఆరుగురిని కాదని, ఇంకా చాలా మందినని తెలుస్తోంది. ముఖ్యంగా, 2002లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, ఆ ప్రమాదాన్ని జరిపించింది కూడా జాలీయేనని తాజాగా వెల్లడి కావడం మరింత సంచలనమైంది. వివరాల్లోకి వెళితే...ఆస్తి కోసం అత్తమామలు సహా మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యుల హత్యకు పాల్పడినట్లు జాలీ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జాలీ పోలీసుల అదుపులో ఉంది.
ఈమె మొదటి భర్త రాయ్‌థామస్ సమీప బంధువు ఎల్సమ్మ అనే మహిళ మీడియాతో మాట్లాడుతూ జాలి మరిన్ని హత్యలకు పాల్పడినట్లు వెల్లడించింది. 2002లో తన కుమారుడు సునీష్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని, ఆ ప్రమాదం చేయించింది జాలీయేనని ఎల్సమ్మ చెబుతోంది.
అలాగే విన్సెంట్ అనే వ్యక్తి ఆత్మహత్యకు, స్థానిక కాంగ్రెస్ నేత రామకృష్ణ మృతి వెనుక జాలీ హస్తం ఉందని ఆరోపించింది. దీంతో ఎల్సమ్మ తెలిపిన వివరాల మేరకు కేసు పునర్విచారణ చేస్తామని ఎస్పీ కె.జి.సమోన్ తెలిపారు.