Sye Raa Narasimha Reddy: వాయిదా పడిన ఏపీ సీఎం జగన్- మెగాస్టార్ చిరంజీవి భేటీ
- నేటి ఉదయం 11 గంటలకు జరగాల్సిన భేటీ
- అనివార్య కారణాల వల్ల వాయిదా
- ‘సైరా’ సినిమాను చూడాల్సిందిగా ఆహ్వానించేందుకేనంటూ వార్తలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి-టాలీవుడ్ ప్రముఖ నటుడు చిరంజీవి మధ్య నేడు జరగాల్సిన భేటీ వాయిదా పడింది. ఈ ఉదయం వీరిద్దరూ భేటీ కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల భేటీని 14వ తేదీకి వాయిదా వేశారు. చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను చూసిన పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. జగన్ అపాయింట్మెంట్ కోరిన చిరంజీవి ఈ సినిమాను చూడాల్సిందిగా ఆహ్వానించేందుకే ఆయనను కలవబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. నేటి ఉదయం 11 గంటలకు అపాయింట్మెంట్ ఖరారైంది. దీంతో చిరంజీవి తన కుమారుడు చరణ్‌తో కలిసి జగన్‌ను కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే, నిన్న రాత్రి పొద్దుపోయాక వీరి భేటీ వాయిదా పడినట్టు వార్తలు వచ్చాయి. అనివార్య కారణాల వలనే భేటీని ఈ నెల 14కు వాయిదా వేసినట్టు సమాచారం. కాగా, చిరంజీవి కోరిక మేరకు ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబంతో కలిసి సినిమాను వీక్షించారు. అద్భుతంగా ఉందంటూ చిరంజీవిని ప్రశంసల్లో ముంచెత్తారు.