coastal ap: కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం.. భారీ వర్షాలకు అవకాశం
- కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
- కోస్తా, రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు
- సముద్రం నుంచి భారీగా వీయనున్న తేమ గాలులు
వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని, కొమెరిన్ తీరం నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. వీటి ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు భారీగా వీస్తాయని తెలిపింది.
అలాగే, కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, నిన్న కూడా కోస్తాలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.