son murdered: కన్నతండ్రే కాలయముడు.. కొడుకును చంపి అదృశ్యం డ్రామా!
- మృతదేహాన్ని పొలంలో కప్పెట్టి కనిపించడం లేదని ప్రచారం
- అందరికీ అనుమానం రావడంతో స్వచ్ఛందంగా లొంగుబాటు
- నిందితుడు పీఏసీఎస్ మాజీ చైర్మన్
అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకునే కొడుకుకు చిన్న గాయమైతే తల్లిదండ్రుల మనసు విలవిల్లాడిపోతుంది. అలాంటిది కన్నతండ్రే కాలయముడయ్యాడు. కొడుకును గొంతు నులిమి చంపేసి అదృశ్యం నాటకానికి తెరతీశాడు. అయితే, అది విశ్వసించే పరిస్థితి లేకపోవడంతో స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయాడు.
పోలీసుల కథనం మేరకు... మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ పీఏసీఎస్ (ప్రాథమిక సహకార పరపతి సంఘం) చైర్మన్ నారాయణరెడ్డి కొడుకు శ్రవణ్‌కుమార్‌రెడ్డి. బీటెక్ చదువు మధ్యలో ఆపేసిన శ్రవణ్ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మానసిక అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో చికిత్స పొందుతున్నాడు. కానీ మానసిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు కుటుంబ సభ్యులతో అకారణంగా గొడవ పడుతుంటాడు.
ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగకు శ్రవణ్ తల్లి పుట్టింటికి వెళ్లింది. సోమవారం దుర్గమ్మ నిమజ్జనోత్సవంలో పాల్గొన్న శ్రవణ్ మిత్రులతో కలిసి మద్యం సేవించాడు. తాగి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన కొడుకును తండ్రి మందలించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఒకరి నొకరు తోసుకున్నారు. ఈ సమయంలో గోడను ఢీకొట్టి కిందపడిపోయిన శ్రవణ్‌ను నారాయణరెడ్డి గొంతునులిమి చంపేశాడు.
అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి సమీపంలోని వ్యవసాయ బోరు పక్కన శవాన్ని పాతిపెట్టాడు. ఆ తర్వాత ఊరి వారితో కలిసి తిరుగుతూ తన కొడుకు కనపించడం లేదని ప్రచారం మొదలుపెట్టాడు. ఈలోగా పుట్టింటి నుంచి తిరిగి వచ్చిన తల్లి కొడుకు కోసం భర్తను నిలదీసింది.
గ్రామస్థులు కూడా తననే అనుమానిస్తుండడంతో ఇక దాచడం సాధ్యం కాదని భావించి ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత నారాయణరెడ్డి గ్రామ సర్పంచ్ రాములుకు జరిగిన విషయం చెప్పాడు. అనంతరం చేగుంట పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతుడి మేనమామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.