Vizag: అరుదైన లెటర్... అత్యంత ఎత్తయిన పోస్టాఫీస్ నుంచి ఉత్తరం పంపిన విశాఖ అమ్మాయి అనూష!
- జూలైలో ట్రెక్కింగ్ కు వెళ్లిన అనూష
- అక్కడ అమ్మకు లేఖ రాసిన విశాఖ యువతి
- నెల రోజుల తరువాత చేరిన వైనం
హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న విశాఖపట్నానికి చెందిన యువతి పుప్పాల అనూష, ట్రెక్కింగ్ కోసం హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లి, అక్కడి ఓ పోస్టాఫీసు బాక్స్ లో వేసిన ఉత్తరం ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ రాష్ట్రంలోని హిక్కిం అనే కుగ్రామంలోని పోస్టాఫీస్ లో ఆమె ఉత్తరాన్ని పోస్ట్ చేసింది. సముద్ర మట్టానికి దాదాపు 4,400 మీటర్ల ఎత్తున, హిమాలయ సానువుల అంచుల్లో ఈ పోస్టాఫీస్ ఉంది. ఇక్కడ ఒక్కో పోస్ట్ కార్డును రూ. 70కి అమ్ముతుంటారు. రాష్ట్ర అందాలను చూపిస్తూ ఉన్న చిత్రాలతో ఇవి ముద్రితమవుతాయి.ఇక ఈ పోస్ట్ కార్డును విశాఖ, మురళీనగర్ లో నివాసం ఉంటున్న తన తల్లి సరస్వతికి అనూష రాసింది. ఆమె ప్రేమలో తాను చూసిన గొప్పదనాన్ని వివరించింది. జూలై నెలాఖరున ఉత్తరం పోస్ట్ చేయగా, దాదాపు నెల రోజుల అనంతరం ఆగస్టు 25న అది గమ్యానికి చేరింది. నిన్న ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా ఆ ఉత్తరాన్ని, పోస్టాఫీస్ బాక్సులో తాను లెటర్ పోస్ట్ చేస్తున్న ఫొటోను అనూష ట్విట్టర్లో పోస్ట్ చేయగా, అది వైరల్ గా మారింది.