Team India: సెంచరీ చేజార్చుకున్న జడేజా... తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన టీమిండియా

  • తొలి ఇన్నింగ్స్ ను 601/5 వద్ద ముగించిన భారత్
  • కోహ్లీ డబుల్ సెంచరీ
  • 91 పరుగుల వద్ద అవుటైన జడేజా

పూణే టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ ను 601/5 వద్ద డిక్లేర్ చేసింది. రెండో రోజు ఆటలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటే హైలైట్. కోహ్లీ కెరీర్ లో 7వ డబుల్ సెంచరీ సాధించడమే కాదు, టెస్టుల్లో 7000 పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. ఇక, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటై కొద్దిలో సెంచరీ మిస్సయ్యాడు. అప్పటికే భారత్ ఎంతో సురక్షితమైన స్థితిలో నిలిచింది. దాంతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ రోహిత్ శర్మ (14) తప్ప అందరూ 50 పైచిలుకు పరుగులు సాధించారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (108), కోహ్లీ (254) మూడంకెల స్కోర్లు సాధించగా, పుజారా (58), రహానే (59) అర్ధసెంచరీలతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడాకు 3 వికెట్లు, కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి చెరో వికెట్ దక్కించుకున్నారు.

273/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా తిరుగులేని ఆధిపత్యం కనబర్చింది. కోహ్లీ కళాత్మకమైన ఆటతీరుతో పరుగులు వెల్లువెత్తించాడు. మరోవైపు రహానే, జడేజా కూడా తమవంతు సహకారం అందించడంతో భారత్ స్కోరు 600 మార్కు చేరుకుంది.

  • Loading...

More Telugu News