Andhra Pradesh: ఏపీలో పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్ క్లాస్ హోటల్స్ తీసుకొస్తాం: మంత్రి అవంతి
- టూరిజం, యువజన సర్వీసులపై సీఎంతో సమీక్షించాం
- 15 పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్ క్లాస్ హోటల్స్
- జిల్లాకు ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తాం
ఏపీలో పర్యాటక ప్రాంతాల్లో వరల్డ్ క్లాస్ హోటల్స్ తీసుకువస్తామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. టూరిజం, యువజన సర్వీసులపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సమీక్షలో అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం, మీడియాతో అవంతి మాట్లాడుతూ, పదిహేను పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్ క్లాస్ హోటల్స్ వచ్చేలా చర్యలు చేపట్టాలని, కొండపల్లి పోర్టు, గాంధీ మ్యూజియం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జగన్ ఆదేశించారని అన్నారు. బోటు రవాణాపై త్వరలో ఓ కమిటీ వేసి నివేదిక అందజేస్తామని, అలాగే, నదిలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జిల్లాకు ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మండల, నియోజకవర్గ స్థాయి స్టేడియం అభివృద్ధి చేస్తామని, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు.
కాగా, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతిలో స్టేడియాల ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. కోటి రూపాయలతో శిల్పారామాలకు మరమ్మతులు చేపడుతున్నామని, ఇడుపులపాయలోనూ శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్టు అవంతి వివరించారు.